Multi Specialty Hospital Stalled Due to Funding Delays :సకల వసతులతో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని గత ప్రభుత్వం చెప్పడంతో ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు. అప్పటి సీఎం జగన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో వైద్యానికి ఇక దూరప్రాంతాలకు వెళ్లే పనిలేదని సంతోషించారు. అయితే వారి సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. నిధుల కొరతతో ఆసుపత్రి నిర్మాణాన్ని నాటి ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో ఎన్డీయే ప్రభుత్వంపైనే ఏజెన్సీ వాసులు ఆశలు పెట్టుకున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు :పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా, ఇందులో 5 మండలాల్లో పూర్తిగా ఏజెన్సీ వాసులే నివసిస్తున్నారు. వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారీ దగ్గరలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్తే తప్ప అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో ఏజెన్సీ ప్రాంతానికి కేంద్ర బిందువు లాంటి ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. బుట్టాయగూడెం శివారు అల్లికాలువ సమీపంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన సముదాయ నిర్మాణం ప్రారంభించింది.
నిధుల కొరతతో పనుల్లో జాప్యం :ఆస్పత్రి నిర్మాణానికి సుమారు రూ. 50 కోట్ల మేర నాబార్డు నిధులు మంజూరు కాగా, 2020 అక్టోబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2021 మేలో నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరినా నిధుల కొరతతో పనుల్లో తీవ్రంగా జాప్యం నెలకొంటూ వచ్చింది. ఒప్పందం ప్రకారం గతేడాది నవంబర్ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా గడువును పెంచారు. గుత్తేదారుకు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని నెలల నుంచి పనులు నిలిపేశారు.