Pending Railway Projects in AP : ఏపీలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు గత ఐదేళ్లలో పడకేశాయి. జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేవీ పూర్తికాలేదు. కొత్తవి మంజూరు చేయించుకోవాలనే ధ్యాస ఏమాత్రం కనిపించలేదు. విశాఖ కేంద్రంగా మంజూరైన కొత్త జోన్ కార్యాలయాల నిర్మాణానికి భూములు అప్పగించలేక చేతులెత్తేసింది. రాజధాని అమరావతికి మంజూరైన కొత్తలైన్‌ను విస్మరించింది.
పూర్తికాని కొత్తలైన్ ప్రాజెక్టులివి (ETV Bharat) ఇలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీకి రైల్వే ప్రాజెక్టుల పరంగా తీవ్ర నష్టమే జరిగింది. ఇప్పుడీ నష్టాన్ని పూరించుకొని, వేగంగా ప్రాజెక్టులు పరుగులు పెట్టించి, కొత్తవి మంజూరు చేయించేందుకు సువర్ణ అవకాశం లభించింది. కేంద్రం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో విరివిగా అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కి తెచ్చుకునే వీలుంది. మన రాష్ట్ర ఎంపీలు రైల్వేశాఖపై ఏమేరకు ఒత్తిడి తెస్తే అంతలా పనులు వేగంగా సాగేందుకు వీలుంటుంది.
Pending Railway Projects in AP (ETV Bharat) Jagan Govt Neglect Railway Projects :దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మన రాష్ట్రంలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్ల పరిధిలోకి వచ్చే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో రైల్వే జోనల్ మేనేజర్ శుక్రవారం నాడు విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీలు ఇచ్చే ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ఏపీకి అవసరమైన కీలక ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ఆవశ్యకతను జీఎం దృష్టికి తీసుకెళ్లి, వాటిపై సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాల్సి ఉంది.
సర్వే చేశాక అటకెక్కించారు (ETV Bharat) అమరావతి లైన్ శరవేగంగా :రాజధాని అమరావతి ప్రాంతాన్ని అనుసంధానం చేసే కీలకమైన కొత్తలైన్ ప్రాజెక్టు గత ఐదేళ్లూ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, సత్తెనపల్లి-నరసరావుపేట,అమరావతి-పెదకూరపాడు లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్లతో ప్రాజెక్టు గతంలో మంజూరైంది. దీనికి డీపీఆర్ కూడా సిద్ధమయ్యే దశలో ఆగిపోయింది. అయితే ముందుగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య సింగిల్ లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని రైల్వేబోర్డు సూచనలు చేసింది. దీనికి కూడా అప్పటి సర్కార్ సహకరించలేదు.
తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టుకు కదలిక మొదలైంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 56.53 కిలోమీటర్ల మేర కొత్తలైన్ నిర్మాణానికి రైల్వేశాఖ సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) రూపొందిస్తుంది. దీంతోపాటు భూసేకరణకు నోటిఫికేషన్లు ఇస్తోంది. గతంలో రాష్ట్ర వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం రాష్ట్రమే భరించాలని రైల్వేశాఖ కొర్రీలు వేసింది. కానీ ఇప్పుడు తమ నిధులతోనే చేసేందుకు ముందుకొచ్చింది. అయితే త్వరగా దీనికి డీపీఆర్ తయారుచేసి, వేగంగా భూసేకరణ జరిగేలా చూస్తే తొందరలోనే ఈ రైల్వేలైన్ పట్టాలు ఎక్కేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలి :
- విజయవాడ-చెన్నై ప్రధాన రైల్వే లైన్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న 309 కిలోమీటర్లు. నడికుడి-శ్రీకాళహస్తి లైన్ గత జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో పనులు వేగంగా సాగలేదు. 2011-12లో ఈ ప్రాజెక్టు మంజూరుకాగా, 2016లో పట్టాలెక్కింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ పాలనలో పనులు శరవేగంగా జరిగాయి. దీంతో న్యూపిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 47 కిలోమీటర్లు పూర్తయింది. తర్వాత గుండ్లకమ్మ-దర్శి మధ్య 27 కిలోమీటర్లు పూర్తై అందుబాటులోకి వచ్చింది. మిగిలిన పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి.
- కోటిపల్లి-నరసాపురం మధ్య 57.21 కిలోమీటర్ల మేర 2011-12లో మొదలైన కొత్తలైన్ పనుల్లో పురోగతి ఉండటంలేదు. కోనసీమ ప్రాంతంలో ఈ రైల్వేలైన్ చిరకాల స్వప్నం. రైల్వేశాఖ దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఇంతకాలం కేవలం గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరిలపై వంతెనల నిర్మాణపనులు సంవత్సరాల తరబడి నెమ్మదిగా సాగుతున్నాయి.
- కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్ పనులు ముందుకు సాగకుండా గత వైఎస్సార్సీపీ సర్కార్ మోకాలడ్డింది. 205 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రాజెక్టు కడప నుంచి పెండ్లిమర్రి, రాయచోటి, వాయల్పాడు, మదనపల్లెరోడ్డు, మదగట్ట మీదుగా వెళ్తుంది. ఇందులో కడప-పెండ్లిమర్రి మధ్య 21.8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. అయితే దీని అలైన్‌మెంట్ మార్చాలని, ముద్దనూరు నుంచి పులివెందుల మీదగా ముదిగుబ్బ వరకు లైన్‌వేసి, ధర్మవరం-బెంగళూరు లైన్‌కు అనుసంధానం చేయాలని జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. రైల్వేశాఖ మాత్రం పాత అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మిస్తామని, దానికే సమ్మతి తెలపాలంటూ కోరుతూ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు స్తంభించిపోయింది.
- అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకలోని తుముకూరు మధ్య 207 కిలోమీటర్ల రైల్వేలైన్ ఇంకా పూర్తికాలేదు. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదగా కదిరిదేవరపల్లి వరకు 63 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ఇంకా ఏపీ పరిధిలోని 31 కిలోమీటర్లు, కర్ణాటకలోని 113 కిలోమీటర్ల పనులు జరగాల్సి ఉంది.
మూడో లైన్‌లో జాప్యం :
- విజయవాడ-నెల్లూరు మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. అయితే విజయవాడ-దువ్వాడ (విశాఖపట్నం) మార్గంలో ఇప్పటికీ మూడో లైన్ నిర్మాణం డీపీఆర్ దశలోనే ఉంది. త్వరగా నిర్మాణ పనులు ఆరంభించేలా చూడాల్సి ఉంది. ఈ మార్గంలో కొత్తగా నాలుగో లైన్ కూడా మంజూరైంది. దీనికి వేగంగా సర్వే జరిగేలా చూడాలి.
- ధర్మవరం-పాకాల-కాట్పాడి మధ్య రెండో లైన్ నిర్మాణం ఎంతో కీలకమైంది. డీపీఆర్ సిద్ధమైనాసరే పనులు చేపట్టలేదు.
కొత్త రైళ్లు పెంచాలి :
- విజయవాడ నుంచి షిర్డీ, ముంబయి, బెంగళూరుకి రైళ్ల కొరత ఉంది. రద్దీకి తగినన్ని రైళ్లు లేవు.
- గతంలో విజయవాడ-హుబ్లీ, విజయవాడ-బెంగళూరు ప్యాసింజర్ ఉండేవి. కరోనా సమయంలో వీటిని నిలిపేసి, తర్వాత పునరుద్ధరించలేదు.
- గుంటూరు-సికింద్రాబాద్ మధ్య రైళ్లను పెంచాలనే డిమాండ్ ఉంది.
- విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు నేరుగా తెనాలి వైపు వెళ్తాయి. అలా కాకుండా విజయవాడ నుంచి న్యూ గుంటూరు మీదుగా తెనాలి వెళ్లి, అక్కడి నుంచి చెన్నై వైపు వెళ్లేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జగనన్న ఏలుబడిలో - పడకేసిన రైల్వే ప్రాజెక్టులు - railway projects in AP
జాతీయ ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం- అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు