Chief Minister Chandrababu Naidu Announced Seven New Airports : రాష్ట్రంలో నూతనంగా మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, వాటి అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
రాష్ట్రంలో కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం, నాగార్జునసాగర్, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందన్నారు. రెండు దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని సైతం సేకరిస్తున్నామని వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దగదర్తిలో విమానాశ్రయాన్ని 1,379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి, అందుకు 635 ఎకరాలను సైతం సేకరించామని చెప్పారు. ఇక మిగిలిన భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో బీపీసీఎల్ చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే ఒంగోలులో విమానాశ్రయ ఏర్పాటుకు 657 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని భావిస్తున్నాట్లు తెలిపారు. అదేవిధంగా తుని-అన్నవరం మధ్య విమానాశ్రయ ఏర్పాటుకు 757 ఎకరాలను గుర్తించామన్నారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం వస్తున్నాయని తెలిపారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీటన్నింటితో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని దీనికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం : అలాగే కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నామని సీఎం తెలిపారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ నివేదికను సైతం అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారని వివరించారు. దీనికి సమీపంలో హెచ్‌ఏఎల్, ఐఏఎఫ్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నందువల్ల సంబంధిత వర్గాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్‌వోసీ) తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కొన్ని విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మళ్లీ వాటిని కార్యరూపంలోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్‌తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. అధికారులు రూపొందించిన వివిధ ఆకృతులను పరిశీలించిన తరువాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ రైల్వే స్టేషన్లకు నూతన సొబగులు - విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దేలా హంగులు