MP Magunta Srinivasulu Reddy Resigned From YSRCP: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీకీ రాజీనామా చేశారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ముగింపు పలుకుతూ రాజీనామా ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించుతున్నట్లు వెల్లడించారు. సౌమ్యుడిగా పేరున్న మాగుంట ఆవేదనతో పార్టీని వీడటం వైసీపీ రాజకీయ దుర్నీతిని చాటుతోందనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా కీలక నేతల రాజీనామాలతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వైసీపీకి మరో షాక్ - పార్టీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా
ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశా:వైసీపీలో మరో కీలక వికెట్ పడిపోయింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పార్టీని వీడుతున్నట్లు ఆయన ఒంగోలులో ప్రకటించారు. వివాద రహితుడుగా పేరున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా తన పని తాను చేసుకుపోవడం, ఇతర పార్టీల నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆయన స్వభావం. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడైన శ్రీనివాసులు రెడ్డి అన్న ఆకస్మిక మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ వాదులైన మాగుంట కుటుంబం మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలు మారుతూ వస్తున్నారు. 1998లో రాజకీయ ప్రవేశం చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.
రాష్ట్ర విభజన, కాంగ్రెస్ నిర్వీర్యంతో 2014లో తెలుగుదేశంలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. మాగుంట సేవలను గుర్తించి తెలుగుదేశం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించింది. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో ప్రాబల్యం పెంచుకుంటున్న వై.వి.సుబ్బారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డే మాగుంటను పార్టీలోకి తీసుకొచ్చారనే వాదన ఉంది. 2019లో వైసీపీ తరఫున ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మాగుంటకు ఆ పార్టీలో అంత గుర్తింపు, గౌరవం గానీ లభించలేదన్నది ఆయన వర్గీయుల ఆరోపణ చేస్తున్నారు.