Corrupt officer in Agriculture Dept : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయనో కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు, ఏ పనిపై వచ్చినా ‘సాయంత్రం 5:30 తర్వాత సార్ ఇంటి వద్దకు రండి’ అనే సంకేతాలు ఇస్తారు. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చవుతుందో ఓ నంబర్ చెబుతారు. బదిలీ చేయించాలన్నా, పోస్టింగ్ కావాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా సరే, ప్రతి పైరవీకి అతని దగ్గర ఓ లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అతీతంగా ఉన్నా, అనుగుణంగా ఉన్నా ఆ లెక్కకు సరిపోలితే చాలు. మరి దాని వంక చూసే పనిలేదు.
సస్పెండైన వారైనా, కేసుల్లో ఉన్న వారైనా అడిగినంతా సమర్పించుకుంటే సరే ఫైల్ కదులుతుంది. లేదంటే మంత్రి సంతకమైనా వారాలు, నెలలు తరబడి ఆగిపోతుంది. వచ్చింది ఎవరు? పని ఏంటనేది కాదు అక్కడ సాయంత్రానికి కలెక్షన్ ఎంతొచ్చిందనేదే ముఖ్యం. భయమూబెదరూ లేకుండా అవినీతి సేద్యం చేస్తున్న ఆ అధికారి తీరు చూసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు. ఆయన రోజువారీ వసూళ్లు రూ.20 లక్షలకు పైమాటే అని ఇంతటి దోపిడీని దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు.
ఈ అధికారి వైఎస్సార్సీపీ పాలనలోనూ ఓ మంత్రి వద్ద పనిచేశారు. అప్పట్లోనూ పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా ఏరికోరి మరీ ప్రత్యేకంగా ఆ అధికారినే పేషీలో నియమించుకోవడం గమనార్హం. ఆయన పేరు చెబితే వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులే కాక కిందిస్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పనులపై వచ్చే కంపెనీల ప్రతినిధులు భయపడుతున్నారు.
చేపపిల్లలైనా - చిరుద్యోగులైనా : ఈ అధికారి వ్యవసాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వారిని కూడా వదలకుండా పిండేస్తున్నారు. జీతాల విడుదలకు సంబంధించిన ఫైల్ కదల్చడానికి చిరుద్యోగులు తమ కష్టార్జితాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. మూడునెలల కిందట పశు సంవర్ధక శాఖలో పదోన్నతులు కల్పించగా ఇందులోనూ భారీగా వసూలు చేశారు. సహకార శాఖలోనూ పదోన్నతుల్లో ముడుపులు ముట్టాయి.
ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి కంపెనీలకు మండలాల కేటాయింపుల్లోనూ చేతివాటం ప్రదర్శించారు. మత్స్య శాఖ పరిధిలోని జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయినా దాన్ని పక్కనపెట్టి కొటేషన్ పద్ధతిలో అప్పగించారు. ఇందులోనూ పెద్దమొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అడ్‌హక్ సిబ్బందికి ఇంక్రిమెంట్ల ఫైల్ కదలడంలోనూ అంతే. ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా విన్పిస్తున్నాయి.
పేషీని నింపేశారు : వ్యవసాయ శాఖ పేషీలోని అధిక శాతం ఉద్యోగులు వైఎస్సార్సీపీ పాలనలో మంత్రుల వద్ద పనిచేసిన వారే ఉన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి వద్ద పనిచేసిన వారు చెబితే మాత్రం ప్రస్తుతం పేషీలో ఫైళ్లు అట్టే సిద్ధమవుతున్నాయి. రోజుల తరబడి తిరిగినా దొరకని మంత్రి అపాయింట్‌మెంట్ వీళ్లు చెబితే దొరుకుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వ్యవసాయ మంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారు. గత ప్రభుత్వంలో పదోన్నతులు, బదిలీల్లో ఆయన పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.
వైఎస్సార్సీపీ సర్కార్‌లో మంత్రుల వద్ద పనిచేసిన మరో ముగ్గురు కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ పేషీలోనే తిష్ఠ వేశారు. ‘రాష్ట్రంలో మంత్రి పేరు ఒక్కటే మారింది పేషీ చూస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లుంది. కార్యాలయానికి ఏ పని మీద వెళ్లినా, జేబులు ఖాళీ కావడం తప్పనిసరి అయిపోయిందని' సిబ్బంది, సందర్శకులు ఆవేదన చెందుతున్నారు.
దేవుడి సొమ్ముతో కాయ్ రాజా కాయ్ - క్రికెట్ బెట్టింగ్‌లకు ఆలయాల నిధులు