Mortgage Loan Frauds in AP : బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద తీసుకున్న రుణాల ఎగవేతకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు బ్యాంకు మేనేజర్ల అవతారం ఎత్తి, గూడుపుఠాణి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులకు ముడుపులు ఇచ్చి అప్పులు చెల్లించకుండానే మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, చివరకు ఆస్తులను విక్రయిస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఏపీలో వెలుగులోకి వస్తున్నాయి.
ఏదైనా ఆస్తి తనఖా పెట్టుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేస్తేనే మార్ట్‌గేజ్ రుణం మంజూరు చేస్తారు. ఆస్తిపత్రాలను బ్యాంకులోనే ఉంచుకుంటారు. తీసుకున్న అప్పు చెల్లించగానే బ్యాంకు మేనేజర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, బాకీ తీరినట్లు బ్యాంకుకు ఇచ్చిన పత్రాలు, ఆస్తి పత్రాలు సమర్పించి మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేయిస్తారు. అప్పుడు ఈసీలో సైతం రుణం తీరినట్లు చూపిస్తుంది.
నకిలీ పత్రాలతో :‘రుణాలు చెల్లించకుండానే ఇతర బ్యాంకుల్లో అప్పు ఇప్పిస్తామని, మీ ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని’ అంటూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ముఠా బయల్దేరింది. బ్యాంకుల్లో బాకీలు తీసుకుని, కట్టలేక ఇబ్బంది పడుతున్న వారిని కొందరు లేఖర్లు, మధ్యవర్తుల ద్వారా గుర్తిస్తున్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల నకిలీ లెటర్ హెడ్‌లు, స్టాంపులు సృష్టిస్తున్నారు. బ్యాంకు మేనేజర్ల అవతారంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి అప్పు తీరిపోయినట్లు పత్రాలు ఇచ్చి మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో ఈసీలో ఎలాంటి రుణం లేనట్లు చూపిస్తోంది. ఒక్కో రుణానికి విలువను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వీరు వసూలు చేస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడలోని ఓ ఫైనాన్స్ సంస్థ వద్ద ఇల్లు తనఖా పెట్టారు. అక్కడ రూ.20 లక్షల అప్పు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌నంటూ ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆ రుణం తీరిపోయిందంటూ నకిలీ పత్రాలు చూపించి, మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ (తనఖా చెల్లు రసీదు) చేయించారు. ఆ తర్వాత అదే ఇంటిపై మరో రెండు ఫైనాన్స్ సంస్థల్లో రూ.కోటి వరకు రుణం తీసుకున్నారు. వాటినీ ఇలాగే చెల్లించేసినట్లు చూపించి, మార్ట్‌గేజ్ డీడ్ రిలీజ్ చేయించుకున్నారు. తాజాగా ఆ ఇంటిని అమ్ముకుని చేతులు దులిపేసుకున్నారు.