Telangana Flood Effected Areas : రాష్ట్రంలో కురిసిన జోరువానలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం 117 గ్రామాల్లో 67 వేల మంది నష్టపోయారు. 26 మంది మృతిచెందగా మరో ఇద్దరు వరదల్లో గల్లంతయ్యారు. అధికంగా ఖమ్మం జిల్లాలో 72 గ్రామాల్లో 49,364 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో 7 గ్రామాల్లో 9,693 మంది నష్టపోయారు. మొత్తం 44 పక్కా ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో 609 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, ఆదేశాలు జారీ చేసింది.
అశ్విని కుటుంబాన్ని పరామర్శించిన సీఎం : మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగులో కారుతో గల్లంతై మృతిచెందిన మోతీలాల్, అశ్విని కుటుంబ సభ్యులను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన మరుసటిరోజే ప్రభుత్వం పరిహారం అందించింది. ఖమ్మం జిల్లాలోని గంగారంతండాకి చెందిన వరద ప్రమాదమృతులు మోతీలాల్, అశ్విని కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు, ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
పశు, మత్స్యకారులకు భారీ నష్టం : రాష్ట్రవ్యాప్తంగా 26,592 జీవాలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ అంచనా వేసింది. అత్యధికంగా ఖమ్మంలో పశునష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. జీవనాధారంగా ఉన్న పశువులు చనిపోవడడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మత్స్యకారులు కూడా కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో వాటిలోని చేపలు కొట్టుకుపోయాయి. వలలు, తెప్పలు, బోట్లు గల్లంతై రూ. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
- సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. వరదలకు మునుపెన్నడూ లేని రీతిలో పశునష్టం సంభవించింది.
- మహబూబాబాద్‌లో 45 చెరువులు తెగి 300 టన్నుల చేపలు, 120 వలలు, మూడు తెప్పలు, మూడు పడవలు కొట్టుకుపోయాయి.
- ఖమ్మంజిల్లాలో 41 చెరువులకు గండ్లు పడగా 139అలుగుపారాయి. ఖమ్మం జిల్లాలో 3,500 టన్నుల చేపలు కొట్టుకుపోగా 400 వలలు, 150 తెప్పలు, నాలుగు కేజ్ కల్చర్ యూనిట్లు దెబ్బతిన్నాయి.
- మహబూబ్‌నగర్ జిల్లాలో 27 చెరువులకు గండ్లుపడగా 15 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. వరంగల్ జిల్లాలో 15 చెరువులు తెగి 82 టన్నుల చేపలు, 45 తెప్పలు, 83 వలలు వరదపాలయ్యాయి.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు చెరువులు తెగిపోవడంతో 158 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. 984 మంది మత్స్యకారులకు చెందిన 3,540 వలలు, 20 తెప్పలు, ఆరు మరబోట్లు గల్లంతయ్యాయి.