Students Absent at YCP Government: పాఠశాలల రిజిస్టర్లలో విద్యార్థుల పేర్లు ఉంటాయి. కానీ తరగతులకు హాజరు కారు. వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడి మానేస్తున్న వారిని తగ్గించి చూపేందుకు చేసిన గిమ్మిక్కులు ఇప్పుడు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో పాఠశాలలకు సరాసరిన గైర్హాజరవుతున్న విద్యార్థులు 24.3% మంది ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు గైర్హాజరు నమోదవుతున్నా ఇప్పటివరకు పట్టించుకున్న నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి 70.37 లక్షల మంది విద్యార్థులు ఉండగా సరాసరిన 53.28 లక్షల చొప్పున మాత్రమే హాజరు నమోదవుతోంది.
ప్రభుత్వ, ఎయిడెడ్ కలిపి 36.02 లక్షల మంది ఉండగా ఇక్కడా అలాంటి పరిస్థితే. పట్టణాల్లో హాజరు కొంచెం ఎక్కువగా నమోదవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటోంది. వ్యవసాయ పనులు, పండగలు, స్థానికంగా నిర్వహించే జాతరలు, సీజనల్ వ్యాధులు, వరదల కారణంగా పిల్లల గైర్హాజరు ఉంటున్నట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు రికార్డుల్లో ఉన్న పిల్లలందరూ బడికి వస్తున్నారా? రాకపోవడానికి కారణాలేంటో తెలుసుకోవాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు.
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం - ఎమర్జింగ్ టెక్నాలజీస్ మేలంటున్న నిపుణులు - New Courses Skills For Best Job
ఆధార్ అనుసంధానంలోనూ జాప్యమే :రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాలు అనుసంధానం కాలేదని పాఠశాల విద్యా శాఖ ఇటీవల తేల్చింది. 1.19 లక్షల మంది విద్యార్థుల ఫోన్ నంబర్లు తప్పుగా నమోదైనట్లు గుర్తించింది. వీటిని సరిచేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. ఆధార్ లేని వారు దసరా సెలవుల్లో తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఏటా సరాసరి ప్రవేశాలు 6 లక్షల వరకు ఉంటాయి. 15 లక్షల మంది ఆధార్ అనుసంధానం కాలేదంటే కొన్నేళ్లుగా బడులకు వస్తున్న వారి వివరాలు నమోదు కాలేదని అర్థమవుతోంది. వ్యవస్థలో ఇన్ని లోపాలుంటే విద్యార్థులను కచ్చితంగా ట్రాకింగ్ చేసే పరిస్థితి ఉండదు.
గత ప్రభుత్వంలో గిమ్మిక్కులు :బడి బయట ఉన్న పిల్లలు, చదువు మధ్యలో మానేస్తున్న వారిని తగ్గించి చూపేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక గిమ్మిక్కులు చేశారు. కర్నూలు లాంటి జిల్లాల్లో పనుల కోసం తల్లిదండ్రులతోపాటు పిల్లలూ వలస వెళ్తారు. కొన్నిచోట్ల వ్యవసాయ పనులకు వెళ్తారు. ఇలాంటి సమయంలో హాజరు తగ్గిపోతుంది. వీరికోసం సీజనల్ వసతిగృహాలు నిర్వహించాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కువ రోజులు బడికి రాని విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో డ్రాపౌట్ బాక్సులో పెట్టగా వాటిని వెనక్కి తీసుకోవాలంటూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చారు. బడి బయట పిల్లల సంఖ్యను తక్కువగా చూపేందుకు అప్పటి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ ఒత్తిడితో పాఠశాలల నుంచి వెళ్లిపోయిన వారి పేర్లను కొన్నిచోట్ల రికార్డుల నుంచి తొలగించలేదు. ఇలాంటివి గైర్హాజరు సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణాలుగా నిలుస్తున్నాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఏడాదిలో 20 రోజులు మించితే తీవ్రమే :విద్యా సంవత్సరంలో విద్యార్థి 20 రోజులకు మించి బడికి రాకపోతే దాన్ని దీర్ఘకాలిక గైర్హాజరుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారు అభ్యసనలో వెనకబడిపోతారు. పాఠాలు సరిగా అర్థంకావు. దీంతో వారు మధ్యలో చదువు మానేసే ప్రమాదం ఉంటుంది. అలాంటి విద్యార్థులు బడికి వచ్చినా వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం లేదు. వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. ఫిన్లాండ్ లాంటి దేశాల్లో విద్యార్థుల గైర్హాజరు 2.8 శాతం మాత్రమే ఉంటోంది. మన దగ్గర 10 శాతం బడి మానేసినా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరసగా నెల రోజులు తరగతులకు హాజరవ్వకపోతే చాలాచోట్ల వారి పేర్లు డ్రాప్ బాక్సులో పెడుతున్నారు. కానీ, వారు ఎందుకు రావడం లేదో తెలుసుకోవడం లేదు.
ఐఐటీ మద్రాసులో రూ.500లకే ఆన్లైన్ కోర్సులు- అప్లైకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే? - Online AI Courses In IIT Madras
ఏలూరు జిల్లాలో వార్డెన్ భర్త ఆకృత్యాలు - ఫొటోషూట్‌లంటూ బాలికలపై లైంగిక దాడి - Eluru Girls Hostel Incident