Jana Nayakudu program in Kuppam Consituency : రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని అయినా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల బాగోగులు చూడటం తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండటం సాధ్యం కాని నేపథ్యంలో ప్రజలు సమస్యలు చెప్పుకొనేందుకు జన నాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా నేరుగా వచ్చినా, సమస్యలు వాట్సప్‌లో విన్నవించినా అందుబాటులో ఉంటామన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాసమస్యలు తన దృష్టికి తెచ్చే సమస్యలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), ఆర్టీజీఎస్‌తో అనుసంధానించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సుపరిపాలనకు ఇది మంచి వేదిక అవుతుందన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, సత్ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తానని తెలిపారు. తొలి రోజు ప్రజల నుంచి 1,090 అర్జీలు తీసుకున్నారు.
అందరికీ పని, ఆదాయం - ఇదే లక్ష్యం: చంద్రబాబు
ఎమ్మెల్యేలు సొంత డబ్బు ఖర్చు చేయాలి
'జననాయకుడు’ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అలీప్‌ను కుప్పానికి తీసుకురావాలని తన భార్య భువనేశ్వరి గట్టిగా చెప్పారని తెలిపారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రూ.8 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిపురం మండలానికి చెందిన రైతు రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని, బోరుకు ప్రభుత్వం తరఫునే మోటారు అందించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
'జననాయకుడు' విధివిధానాలివి
- ఫిర్యాదుల స్వీకారానికి కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అర్జీలు తీసుకుని వచ్చేవారికి సిబ్బంది కాఫీ/టీ ఇచ్చి కూర్చోబెట్టి వారి సమస్యేంటో తెలుసుకుని పోర్టల్‌లో నమోదు చేస్తారు.
- కార్యాలయంలో ఆరు విభాగాలకు ఆరుగురు అధికారులు ఉంటారు. వారు ప్రజల సమస్యల్ని తెలుసుకుని వివరాలను పోర్టల్‌లో పొందుపరుస్తారు.
- ప్రభుత్వం పరిష్కరించే సమస్యలైతే పీజీఆర్‌ఎస్‌కి, పార్టీ తరఫున చేయాల్సిన పనులైతే పార్టీ నాయకత్వానికి సూచిస్తారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కరించే వీలుందో కూడా రాసి ఇస్తారు.
- ఫిర్యాదుదారు సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది.
- కార్యాలయం వరకు రాలేని వారికి టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులోకి తెస్తారు. ఫిర్యాదు చేసిన వారికి తిరిగి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందో లేదో తెలుసుకుంటారు. పరిష్కారంపై వారు సంతృప్తిగా ఉన్నారా లేదా కూడాతెలుసుకునేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
- ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలపై సుమోటోగా స్పందిస్తారు. జననాయకుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.
- ప్రజలు ఇచ్చిన అర్జీల్లో పరిష్కారమైనవి, వివిధ దశల్లో ఉన్నవి సీఎం నేరుగా చూసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు.
కుప్పంలో సూర్యఘర్ పథకం - భవిష్యత్‌లో విద్యుత్ బిల్లు కట్టే భారం ఉండదు: సీఎం చంద్రబాబు
పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు