Janasena on Kiran Royal Issue : జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై రెండు రోజులుగా వస్తున్న అభియోగాలపై హైకమాండ్ స్పందించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాలపై ఓ మహిళ ఆయనపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశించారని, అప్పటివరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి పి. హరిప్రసాద్ అందులో తెలిపారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలి తప్ప, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత అంశాలపై కాదని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు, కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారిని కలిసి తనపై ఆరోపణలు చేసిన మహిళతో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
కిరణ్ బెదిరించారంటూ మహిళ ఫిర్యాదు : తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ తనను, తన ఇద్దరు కుమారులను చంపేస్తానని బెదిరించారని సదరు మహిళ ఆదివారం రాత్రి ఎస్వీయూ పోలీసులను ఆశ్రయించారు. తనకివ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇప్పించడంతోపాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.
అరెస్ట్: జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ నుంచి వస్తుండగా ఆన్‌లైన్ ఛాటింగ్ కేసులో ఆమెను జయపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్వీయూ పోలీసుస్టేషన్‌కు తరలించారు.