Cyber Crime With Phone Pay : ఇంటర్నెట్ బ్యాంకింగ్, జీపే, ఫోన్‌పే, పేటీఎం ఇతర థర్డ్‌పార్టీ మొబైల్ మనీ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సైబర్ మోసగాళ్లు ‘జంప్డ్’ అనే కొత్త టెక్నాలజీతో ప్రజలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. అందులో నేరగాళ్లు తమ నంబరును ఉపయోగించి అమాయకపు ప్రజల ఖాతాల్లో రూ.5 వేల నుంచి అంతకంటే తక్కువ జమ చేస్తారు.
ఆ తర్వాత మీ ఖాతా నగదు జమ అయ్యిందంటూ మెసేజ్ వస్తుంది. మీరు డబ్బు అందుకున్నారంటూ ఫోన్‌లో సందేశంతో పాటు లింక్ పంపిస్తాడు. సాధారణంగా మనం వెంటనే నిజంగా ఖాతాలో నగదు జమ అయిందా కాలేదా? అని ఫోన్‌పే ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసి పిన్ నంబరు ఎంటర్ చేస్తాం. అంతే ఇంకా మోసగాళ్లకు మన ఖాతాను అప్పగించినట్లే, విత్‌డ్రా అభ్యర్థనను ధ్రువీకరించినట్లే అవుతుంది. ఆ తర్వాత మన ఖాతా సైబర్ నేరగాడికి యాక్సెస్ అవుతుంది. ఆ మోసగాడు స్వయంగా మన ఖాతాలోని డబ్బును యజమానిలా నేరుగా విత్‌డ్రా చేసుకుంటాడు. అందుకోసమని మన ఖాతాలో గుర్తు తెలియని నంబర్ల నుంచి చిన్న మొత్తాలు జమ అయ్యాయంటే దానిని కచ్చితంగా మోసమని గ్రహించి జాగ్రత్తపడాలి.
మీకు ఇదే సమస్య ఎదురైతే ఇలా చేయండి :బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి ముందు మీ వాస్తవ పిన్ నంబరు నమోదు చేయకుండా తప్పుడు పిన్ నంబరు ఎంటర్ చేయండి. దీంతో అవతల నేరగాడి ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ తర్వాత ఖాతా నిజమైన పిన్ నంబరుతో బ్యాలెన్స్ ఎంత ఉందనేది తనిఖీ చేసుకోవాలి.