Mohanbabu Lunchmotion Petition in Telangana High Court: రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మోహన్‌బాబు, విష్ణులకు హైకోర్టులో ఊరట లభించింది. మోహన్‌బాబు లంచ్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ఈ నెల 24 వరకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పహడీషరీఫ్ పీఎస్‌లో కేసు నమోదు కాగా దర్యాప్తులో భాగంగా మోహన్‌బాబు, విష్ణులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని కుటుంబ విషయాలను మీడియాలో పెద్దదిగా చేసి చూపిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మోహన్‌బాబు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు ఈనెల 24 వరకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కేసును వాయిదా వేసింది.
హెల్త్ బులెటిన్: నటుడు మంచు మోహన్‌బాబుకు బీపీ ఎక్కువగా ఉండి అధిక నొప్పులతో హాస్పిటల్‌లో చేరారని కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. అయనకు కొన్ని గాయాలతోపాటు కంటి కింద వాపుగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు హాస్పిటల్‌కు వచ్చారని పేర్కొన్నారు. బుధవారం సిటీ స్కాన్ చేస్తామన్నారు. మోహన్‌బాబు ఆరోగ్యంపై ఆసుపత్రి చైర్మన్ హెల్త్ బులిటెన్ విడుదల చేసి వివరాలను ప్రకటించారు.