Chandrababu on India Brand : అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిచేసే యువత ఉన్న దేశంగా భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టంచేశారు. దావోస్ వేదికగా భారత్ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్‌నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, తమిళనాడు, కేరళ మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు.
గతంలో దావోస్‌కు ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారని చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా ఇక్కడ అందరం ఒక్కటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నా టీమ్ ఇండియాగా అందరిది ఒకే లక్ష్యమని తెలిపారు. భారత్ నుంచి దావోస్ సదస్సుకు హాజరవుతున్న వారిలో తానే సీనియర్‌నని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదని ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్ స్టాపబుల్ అని చంద్రబాబు వెల్లడించారు.
ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే. సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోంది. వ్యాపార దక్షత, నైపుణ్యాలు ఉన్న యువత, జనాభా ఎక్కువగా ఉండటం భారత్‌కు వరాలు. ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలందిస్తోంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులే. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైంది. ఈ సమావేశమే దానికి ప్రత్యక్ష నిదర్శనం.మేం ఇక్కడి నుంచి టెక్నాలజీని తీసుకెళ్లడం లేదు. ప్రపంచానికే మన దేశం టెక్నాలజీని అందజేస్తోంది. ప్రధాని మోదీ టెక్నాలజీకి బలమైన పునాది వేశారు. - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu Davos Tour Updates : ప్రధాని మోదీ మార్గదర్శనంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రపంచ యవనిక మీద భారత్ సగర్వంగా నిలిచిందని చెప్పారు. అత్యుత్తమ విధానాలే భారత్ ఇప్పుడు బలమైన దేశంగా మారడానికి కారణమని మరో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దావోస్ వేదికగా వేర్వేరు రాష్ట్రాలకు, పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు రావడమే భిన్నత్వంలో ఏకత్వానికి ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అందరం కలిసి ప్రధాని విజన్‌ని కార్యరూపంలోకి తీసుకొద్దామని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. సమావేశంలో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులకు పోటీపడినా ఒకే దేశంగా అంతా ఒక్కటిగానే పనిచేస్తామని చెప్పారు. వన్ ఇండియా అన్నది తమందరి నినాదమని అన్నారు. ఇదే భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఒక ఐకాన్, అలాగే టెక్ మ్యాన్ అని కొనియాడారు. తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తని తెలిపారు.
అప్పుడు ఐటీ - ఇప్పుడు ఏఐ: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
ఏపీలో పెట్టుబడులు పెట్టండి - గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం