Chandrababu on Inheritance : వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్యన్నఆయన అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేశ్‌కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి నాలుగోసారీ మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి, అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని ఎక్కడా కక్షసాధింపు ఉండబోదని వెల్లడించారు.
దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్యని వ్యాఖ్యానించారు. సీఎం, పార్టీ అధినేతగా లోకేశ్ వారసత్వంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని అన్నారు.
Chandrababu on Lokesh : తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆ వ్యాపారం అయితే లోకేశ్‌కు చాలా తేలికైన పని అన్న ఆయన కానీ లోకేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అందులో సంతృప్తి పొందుతున్నారని ఇందులో వారసత్వమంటూ ఏమీ లేదని చంద్రబాబు వివరించారు.
కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని అందుకే ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని వివరించారు. గుజరాత్‌లో ఐదుసార్లు వరుసగా బీజేపీ గెలిచిందన్న సీఎం దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్దఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తంచేశారు.
సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. వారు వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఎన్నడూ లేని విజయం అందించారని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నామని వివరించారు. అమెరికన్లందరికీ స్వర్ణయుగమని అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున చెప్పారని సీఎం వెల్లడించారు.
Chandrababu Davos Tour Updates : తాము 15 శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నామని సీఎం తెలిపారు. అప్పటికల్లా 45,000ల డాలర్ల తలసరి ఆదాయం సాధించాలనేది లక్ష్యమని ఉద్ఘాటించారు. వనరులను పెద్దఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశాభివృద్ధికే విఘాతమని పేర్కొన్నారు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలన్నారు. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు చెప్పారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవని అన్నారు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తామన్నారు. జగన్‌పై ఇప్పుడే కాదు, గతంలోనూ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకు ఎవరైనా ప్రజల్ని ఒకసారి మాత్రమే మోసం చేయగలరు ఎప్పుడూ కాదని సీఎం జవాబిచ్చారు. గత సర్కార్‌లో జరిగిన అదానీ విద్యుత్ కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా? అని విలేకర్లు ప్రశ్నించగా అది యూఎస్‌లో కోర్టులో పెండింగ్‌లో ఉందని కచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రపంచానికే మన దేశం టెక్నాలజీని అందజేస్తోంది : సీఎం చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులు పెట్టండి - గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం