Mobile Theft in Hyderabad :మనిషి జీవితంలో మొబైల్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఈ కాలంలో సెల్‌ఫోన్ లేనిదే ఎవరూ అడుగు బయటపెట్టట్లేదు. యువత అప్పుచేసి మరీ ఖరీదైన సెల్ఫోన్లు కొంటున్నారు. అలాంటి సెల్‌ఫోన్ చోరీ జరిగితే ఆ బాధను చెప్పడానికి మాటలు రావు. రాష్ట్రంలో ఇటీవల చరవాణీ చోరీ కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చోరీ చేసిన సెల్ఫోన్లలో దుండగులు తెలివిగా యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలోని నగదును కాజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలా అపహరించిన ఫోన్లను అన్‌లాక్ చేయించేందుకు నేరగాళ్లు నగరంలోని కొన్ని మొబైల్ దుకాణాల్లోని వ్యక్తులను అనుచరులుగా మార్చుకుంటున్నారు. ఫోన్ అన్‌లాక్ కాగానే తొలుత ఖాతాల్లోని డబ్బులు ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంకు సిబ్బందికి కస్టమర్లుగా కాల్‌చేసి పాస్‌వర్డ్ తెలుసుకుంటున్నారు. దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బంకుల వద్ద చేరి అత్యవసరంగా డబ్బు కావాలంటూ జాలిగా మాట్లాడతారు. డెబిట్ కార్డులు మరచిపోయామని యూపీఐ నుంచి నగదు బదిలీ చేస్తామని ఏటీఎం నుంచి తీసిస్తే చాలంటూ ప్రాధేయపడతారు. ఇదంతా నిజమని భావించి కొందరు డబ్బు తీసి నేరగాళ్లకు ఇస్తున్నారు.
రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఫోన్ మాయం :ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఫోన్‌ని దుండగులు మాయం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరాక గుర్తించిన బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ బ్లాక్ చేసేలోపు అతడి యూపీఐ ఖాతాలోని రూ.1.40 లక్షలు మాయమయ్యాయి. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సిటీ బస్సులో కార్యాలయానికి బయల్దేరారు. మార్గమధ్యంలో చరవాణీ చోరీకి గురైంది. సమీపంలోని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లేలోపే అతడి ఖాతాలోని రూ.1.50 లక్షలు మాయమైంది.