MLC Kavitha Contesting in Lok Sabha Elections నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎమ్మెల్సీ కవిత ఔట్ మెదక్ నుంచి పోటీ MLC Kavitha Medak Lok Sabha Seat 2024 :నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గతలోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. పసుపు రైతుల పోటీతో ఇందూరు సంచలనంగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి (MP Arvind) విజయం సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి, కేసీఆర్ కుమార్తె కవిత భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయరనే ఉహాగానాలు మొదలయ్యాయి.
MLC Kavitha Lok Sabha Elections 2024 :ఇటీవల పార్లమెంట్‌ల వారీగా జరిగిన సమీక్ష సమావేశంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులపై ఆమె తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ద్వారా తన అభిప్రాయాలను బయట పెట్టించినట్లు తెలిసింది. సమీక్ష సమావేశం తర్వాతే కవిత నిజామాబాద్‌లో పోటీ చేయరనే ప్రచారం ఊపందుకుంది. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు సైతం కవిత మెదక్ నుంచి పోటీ చేస్తారని ఇటీవల ఓ ప్రెస్ మీట్లో చెప్పడంతో ఆమె మెదక్ నుంచి పార్లమెంట్ బరిలో నిలుస్తారన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో నిజంగానే కవిత నిజామాబాద్ నుంచి పోటీ చెయ్యడం లేదా అంటూ స్థానిక నేతలు ఆరా తీస్తున్నారు.
త్వరలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్ పోటీపై ఇదే క్లారిటీ
MLC Kavitha Out From Nizamabad Lok Sabha : కవిత (MLC Kavitha) పోటీ చేయకుంటే నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆయన తమ్ముడు ఎన్నారై మహేష్ బిగాల, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లు వినిపిస్తున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్‌ను (Bajireddy Govardhan) కేటీఆర్ (KTR) అడిగినట్లు సమాచారం. మహేష్ బిగాల పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. నిజామాబాద్ లేదంటే సికింద్రాబాద్‌లో ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు సన్నిహితుడిగా మహేష్ బిగాలకు పేరుంది. కవిత పోటీ చేయకుంటే మహేశ్‌కే అవకాశం లభిస్తుందని ప్రచారం సాగుతోంది. ఓ విద్యాసంస్థల ప్రతినిధి సైతం పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఓడించి కవిత ప్రతీకారం తీర్చుకుంటారని ఇన్నాళ్లూ బీఆర్ఎస్ (BRS) స్థానిక నాయకులు భావిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఆమె మెదక్ నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకోవడంతో, నిజామాబాద్ బరి నుంచి కవిత తప్పుకుంటే పరిస్థితి ఏంటి? ఎవరు అభ్యర్థిగా వస్తారోననే అంశంపై ప్రస్తుతం గులాబీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి - గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధుల కోసం వేట
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం - వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు