Miss World Competition 2025 in Hyderabad :2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. వచ్చే మే నెలలో 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహణ సంస్థ తెలిపింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
ప్రారంభ, ముగింపు వేడుకలు : 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో మే7 నుంచి మే 31 వరకు జరుగుతాయని నిర్వాహకులు బుధవారం తెలిపారు. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
మిస్ వరల్డ్ పోటీల గురించి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ కలిసి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో జరగనున్న 72వ అందాల పోటీల ఎడిషన్ గురించి మాట్లాడుతూ మోర్లీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను గొప్ప సంస్కృతి, ఆవిష్కరణలకు ఆతిథ్యమిచ్చే రాష్ట్రంగా ఆమె అభివర్ణించారు.
"తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ అద్భుతమైన వారసత్వం చూపించడానికి ఉపయోగపడుంది. ఈ సహకారం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం గురించి మాత్రమే కాదు, ఇది మహిళలకు సాధికారత కల్పించడం, అందం పట్ల ఐక్యంగా ఉండే మన నిబద్ధత, స్థిరమైన ప్రభావాన్ని చూపడం." -మోర్లీ, మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్