Morphing Photo Blackmail Case :ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. చిన్న కుటుంబాల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పిల్లలతో మాట్లాడే తీరిక తల్లిదండ్రులకు లేకుండా పోయింది. దీంతో వారు ఒంటరితనానికి లోనవుతున్నారు. ఆ ఒంటరితనాన్ని పొగొట్టుకునేందుకు సెల్ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఆ పరిచయాలే ఇప్పుడు అనర్థాలకు దారి తీస్తుండటం కలకలం కలిగిస్తున్నాయి.
సమయం దొరికితే చాలు ఆన్లైన్లో గడుపుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. హద్దులు దాటనంతవరకు అవి బాగానే ఉంటాయి. కానీ కొన్ని సార్లు ఆ పరిచయాలే కొంపముంచుతున్నాయి. ఎందుకంటే కొందరు మోసగాళ్లు, బాలికలు, యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
Boy Blackmails a Girl in Instagram :తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ మైనర్లు. ఒకరికొకరు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత సరదాగా బయట కలిసి ఫొటోలు దిగారు. అక్కడి నుంచి అతను తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా వారు దాచిన డబ్బు తీసి అతనికి ఇవ్వసాగింది. ఇదే అదునుగా అతను పలుమార్లు ఆమెను బెదిరింపులకు గురిచేసి నగదు రాబట్టుకుని జల్సాలకు వాడుకున్నాడు.