Ministers about G.O 317 and 46 in Sub Committee Meeting : జీవో నంబర్లు 317, 46 వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై, పలు అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవో నంబర్లు 317, 46లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి చర్చించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది. సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ : 317 జీవో సంబంధించి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలను, వినతులను కమిటీ ముందు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని సబ్ కమిటీ ఆదేశించింది. అందుకు అన్లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించాలని కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను సూచించారు.