Uttam Kumar Reddy On Tummidihatti Barrage: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మండలిలో తుమ్మిడిహట్టి, గంధమల్ల రిజర్వాయర్లపై సభ్యులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టే అంశంపై ప్రభుత్వం స్పందించాలని జీవన్‌రెడ్డి కోరారు. అక్కడ కడితే పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు నాలుగు నెలల్లో పనులు మొదలు పెడతామని, సాంకేతిక నిపుణులతో మాట్లాడిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులపై నేషనల్ డ్యాం సేఫ్టి ఆథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోందని తెలిపారు.
మరోవైపు గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభలో ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం చేకూరుతుందని, ఆ దిశగా ఆలోచించాలని మల్లన్న ప్రభుత్వాన్ని కోరారు. ఈ బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
లైవ్ LIVE UPDATES : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు - telangana assembly live updates
ఇక గంధమల్ల ప్రాజెక్టుపై తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెబుతూ, గంధమల్ల కోసం ఇప్పటివరకు రూపాయి పని కూడా జరగలేదన్నారు. ప్రాజెక్టు భూసేకరణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే గంధమల్ల మునిగిపోతుందని చెప్పారు. గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఎంత కెపాసిటీతో గంధమల్ల నిర్మించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
'తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం మూడు నాలుగు నెలల్లో పనులు మొదలుపెడతాం. సాంకేతిక నిపుణులతో మాట్లాడిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోంది. ఈ వారంలో నేషనల్ డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీ కాళేశ్వరం పరిశీలన ఉంది. అన్నారం, సుందిళ్ల అందుబాటులోకి వస్తే నీటి నిల్వకు పరిశీలిస్తామని చెప్పారు. గంధమల్ల ప్రాజెక్టు భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని స్థానికులు సహకరిస్తే పనులు ప్రారంభిస్తాం. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
నేటి శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు - బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షపై ఏకగ్రీవ తీర్మానం! - TG ASSEMBLY SESSION SECOND DAY 2024