Minister Uttam about Tenders for Rescue Operations : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్ హౌస్‌ను యుద్ధప్రాతిపదికన పూర్వ స్థితికి తీసుకురావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని చెప్పారు. వెంటనే పాలనా పరమైన అనుమతులు తీసుకొని శుక్రవారం ఉదయానికి ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని సూచించారు. వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు సమీక్షలో హాజరయ్యారు.
ఎగువన ఉన్న గొలుసు కట్టు చెరువు తెగడంతో ఒక్కసారిగా ఆడిట్ ద్వారా వరదనీరు పంప్ హౌస్‌లోకి చేరినట్లు ఇంజినీర్లు మంత్రికి వివరించారు. పంప్ హౌస్ నిర్మాణ సమయంలో ఆ తరహా జాగ్రత్తలు తీసుకోలేదా ముందస్తుగా అంచనా వేయలేదా అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంజినీర్లను అడిగారు. అకస్మాత్తుగా వచ్చిన వరద పంప్ హౌస్‌ను ముంచెత్తిందని వివరించారు. పంప్ హౌస్‌లోని నీటిని తోడే పని ప్రారంభమైందని, నెల రోజుల్లో మళ్లీ యథాతథ స్థితికి వస్తుందని తెలిపారు. ఈ మేరకు అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఇంజినీర్లను ఆదేశించారు.
శాశ్వత మరమ్మతులకు రూ.350 కోట్ల అంచనా : యుద్ధప్రాతిపదికన పూర్వ స్థితికి తీసుకురావాలన్న మంత్రి, పనులు వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీకి స్పష్టం చేయాలని తెలిపారు. భవిష్యత్‌లో ఈ తరహా ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదన్న ఆయన, సంబంధిత చీఫ్ ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాద సంకేతాలు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రాజెక్టులతో పాటు జలాశయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.