Minister Uttam Kumar On Paddy Procurement : గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇచ్చేదిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రజల సొమ్ముతో అప్పుచేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం విషయంలో అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో ఖరీఫ్ పంట కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఉత్తమ్ సమీక్షించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సన్నద్ధత, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
ధాన్యం దిగుమతి జరగకుండా చర్యలు :సరిహద్దు రాష్ట్రల నుంచి ధాన్యం దిగుమతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. రాష్ట్రంలో పండిన ప్రతిగింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 7,139 ధాన్యంకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నాలు, దొడ్డు వడ్లు వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ధాన్యంపై రూ.500 బోనస్ :రైతులను సన్నాలవైపు ప్రోత్సహించేందుకు వీలుగా క్వింటాల్ ధాన్యంపై 500 బోనస్ అందించన్నట్లు ఉత్తమ్ వివరించారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయంగా మంత్రి అభివర్ణించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేందుకు వీలుగా గోదాములను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.