Minister Uttam Kumar on BRS :గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో రూ.23 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతగిరి మండలంలో పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడిన ఆయన బీఆర్ఎస్పై పలు విమర్శలు గుప్పించారు.
ఆ విషయంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందింది :కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కోదాడ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆక్రమణలు అరికట్టేందుకు :పెద్ద చెరువు ఆక్రమణలు అరికట్టేందుకు రూ.8కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కింది స్థాయిలో అభివృద్ధికి ప్రజాప్రతినిధులు-అధికారులు భాగస్వామ్యం కావాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.