Minister Uttam on New Ration Cards : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు నిత్యావసర సరకులకు, హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేలా విడివిడిగా అందజేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో ఇవాళ తన అధ్యక్షతన కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం 4వ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త సంచాలకులు ప్రియాంక ఆల, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, ఇతర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై తాము చర్చించామని ఉత్తమ్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్ మాసంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది పక్రియ, ఖరారు ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారులు 2 కోట్ల 81 లక్షల 70 వేల మంది ఉన్నారని ప్రస్తావించారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు.