Minister Thummala on Raithu Bharosa : ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూ. 53వేల కోట్లు ఖర్చు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గణతంత్ర దినోత్సవం నాడు పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు ఎకరాకు రూ. 12వేలను మహోత్తరమైన రైతు భరోసా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామంటున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఈటీవీ భారత్ ఫేస్‌టుఫేస్.
గత పాలకుల వల్ల అన్నీ శాఖలు నిర్వీర్యం : ఇందిరమ్మ రాజ్యంలో రైతులు, వారి సంక్షేమం అలాగే పేదలు, వారి సంక్షేమం. ఈ రెండింటిని ఆర్థిక వెసులుబాటు లేకపోయినా సమర్థంగా అమలు చేయడానికి తీవ్ర శ్రమ చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల తెలిపారు. గతంలో పాలకుల వల్ల, ఆలోచన లేని పనుల వల్ల అన్నీ శాఖలు నిర్వీర్యం అయ్యాయని ఆక్షేపించారు. దీనివల్ల వ్యవస్థల్లో పనితనం ఆగిపోయిందని, ఖర్చులు, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ అధికారంలోకి వచ్చిన మొట్ట మొదటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు, రూ. 500లకే గ్యాస్, రూ. 10 లక్షల ఆరోగ్య శ్రీ, 200ల యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని తెలిపారు.
రైతు భరోసా విషయంలో ఎక్కువ మంది 10 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఇంకా కొంతమంది సాగుకు యోగ్యం కాని భూములకు ఇవ్వొద్దని చెప్పారని గుర్తు చేశారు. దీనికి తగ్గట్టుగానే వ్యవసాయం చేయడానికి పనికిరాని భూములను రైతు భరోసా నుంచి తీసివేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. దానికనుగుణంగా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని చెప్పారు.