Minister Tummala On Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సన్నబియ్యానికి బోనస్ కచ్చితంగా ఇస్తామన్నారు. డిసెంబరు 7లోగా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని, కేబినెట్ సబ్-కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రైతుభరోసా ఇస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు ఆయా పార్టీలో అంతర్గత ఆధిపత్యం కోసమో అధికారంలోకి రావాలన్న ఆత్రుతలోనో రైతాంగాన్ని బలిపెట్టవద్దని మంత్రి ధ్వజమెత్తారు.
దేశంలోనే మొదటి స్థానంలో : భారతీయ జనతా పార్టీకి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం తేమ వంటి విషయాల్లో నిబంధనలు, విధివిధానాలను రైతులకు అనుకూలంగా మార్చాలన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి దిగుబడి వచ్చిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 46 లక్షల టన్నులతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు వివరించారు. ప్రభుత్వ సూచనల మేరకు సన్నబియ్యం సాగుకు రైతులు ముందుకొచ్చారని తెలిపారు. గతేడాది 25 లక్షల ఎకరాల్లో ఉండగా ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు వేశారని వివరించారు.
దొడ్డు బియ్యం 41 లక్షల నుంచి 26 లక్షల ఎకరాలకు పడిపోయిందని తుమ్మల వివరించారు. గతేడాది ఈరోజుతో పోలిస్తే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపు వంటివి ఎక్కువగానే ఉన్నాయని తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 27 జిల్లాల్లో 7 వేల 411 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల 222కోట్ల రూపాయల విలువైన 9 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి అన్నదాతలకు రూ.622 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. బోనస్ చెల్లించే ప్రక్రియ కొనుసాగుతోందని తుమ్మల తెలిపారు. పత్తి దిగుబడి తగ్గినప్పటికీ కొనుగోళ్లు మాత్రం గతేడాదితో పోలిస్తే పెరిగాయని వివరించారు.