Minister Tummala Comments on Loan Waiver : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో రుణమాఫీ జరగని సుమారు 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో జరగనున్న 'రైతు పండుగ' సందర్భంగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరగగా, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ సులోచనతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇంత అప్పుల్లో ఉన్నా, రూ.47 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటికే 22 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, తెల్లరేషన్ కార్డు లేకపోవడం, వివిధ టెక్నికల్ సమస్యలతో ఆగిపోయిన సుమారు 3 లక్షల మంది రైతులకు మహబూబ్‌నగర్‌లో ఈ నెల 30న జరగబోయే రైతు పండగ రోజు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.47 వేల కోట్లు కేటాయించాం. అందులో నుంచి రూ.18 వేల కోట్లు వెచ్చించి ఇప్పటికే పలువురికి రుణమాఫీ చేశాం. రేషన్ కార్డు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో సుమారు 3 లక్షల మందికి రుణమాఫీ జరగలేదని మా దృష్టికి వచ్చింది. వారందరికీ ఈ నెల 30న రుణమాఫీ డబ్బులు జమ చేస్తాం. - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు