Minister Thummala on Rythu Bandhu Balance Funds :రాష్ట్రంలో రైతుబంధు సాయం ఇప్పటి వరకు 54,29,645 మంది రైతులకు అందజేశామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala) అన్నారు. 2024 వానాకాలం సీజన్ సన్నద్ధత, ఇతర కార్యకలపాలపై సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు(Marketing Departments), మార్క్‌ఫెడ్ సంస్థ రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యలు, రానున్న వానాకాలం-2024 సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
Minister Thummala Markfed Purchase Orders : యాసంగి పంటలు మార్కెట్‌కు వస్తున్న క్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు అప్రమత్తముగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఏ పంటకైనా మద్దతు ధర కంటే తక్కువ వస్తే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర లేదా అంతకంటే ఎక్కువ ధర పొందేటట్లు చూడడం రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు కొనసాగించాలి - సీసీఐని కోరిన మంత్రి తుమ్మల
మిర్చి పంటకు సంబధించి అవసరమైతే సెలవు దినాల్లో కూడా క్రయ విక్రయాలు జరిగేలా చూడాలని సూచించారు. వరుస సెలవు దినాల తర్వాత ఒక్కొక్కసారి పెద్ద ఎత్తున సరకు మార్కెట్‌కు తరలివచ్చే అవకాశాలు ఉంటుండటంతో ముందుగానే తగిన జాగ్రతలు తీసుకోవాల్సిందిగా అధికారులను అదేశించారు. కేంద్రం కనీస మద్దతు ధర( Minimum Support Price) ప్రకటించి, కొనడానికి సిద్ధంగా ఉండి రాష్ట్రంలో సాగవుతున్న ప్రతి పంటకు కొనుగోలు ప్రతిపాదనలు పంపి, అనుమతులు ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు ఆరంభించవల్సిందిగా మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి :ఏ ఒక్క రైతు మద్దతు ధర రాక నష్టపోకూడదన్నది ఈ ప్రభుత్య ఆలోచన అని స్పష్టం చేశారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రానిపక్షం లేదా వారి జాబితాలో లేని పంటలు మన దగ్గర సాగులో ఉంటే, ఆ వివరాలు వ్యవసాయ శాఖ ద్వారా తెప్పించుకొని కొనుగోలుకు ప్రతిపాదనలు ముందుగానే పంపించి అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. అదే విధంగా ఇప్పటికే 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించగా, మిగత వాటిలో కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వివరించారు.