Minister Sridhar Babu Review on MS Data Centers : మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి కార్యకలాపాలను పెంచాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంస్థ ప్రతినిధులను కోరారు. విస్తరణ పూర్తయితే అత్యాధునిక డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు.
డేటా సెంటర్లకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. మైక్రోసాఫ్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్ ఇయాన్ కాలన్, భూ అభివృద్ధి విభాగం హెడ్ ఉత్తమ్ గుప్తా, ఇండియా కమ్యూనిటీ హెడ్ శ్రీచందన మంత్రికి డాటా విస్తరణపై సానుకూలతలు సహా ప్రతికూలతలను కూలంకషంగా వెల్లడించారు.
Microsoft Representatives on Land Acquisition Issues : డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్టు మైక్రోసాఫ్ట్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంకను ఆదేశించారు. విద్యుత్తు సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువల నిర్మాణం లాంటి పనులు గడువులోగా పూర్తి చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.