Minister Seethakka On Disabled People Jobs : దివ్యాంగులు కంపెనీల చుట్టూ ఇకపై తిరగాల్సిన అవసరం లేదు. వారికి ఉద్యోగాలు కల్పించే దివ్యాంగుల జాబ్ పోర్టల్‌ను రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇవాళ మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు.
ప్రైవేట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక శాతం రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్ పాటిస్తామని మంత్రి చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టులకు త్వరలో భర్తీ చేయనున్నట్లు సీతక్క తెలిపారు. దీనిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.
"దివ్యాంగులకు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమాల్లో చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.50 కోట్ల ఖర్చు చేస్తున్నాం. మహిళ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలు జారీ చేశాం."- సీతక్క, మంత్రి