KTR Defamation Petition Hearing Adjourned : మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ నిర్వహించింది. పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్‌తో పాటు సాక్ష్యులుగా పేర్కొన్న బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలను నమోదు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఐదుగురు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మంత్రి కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశంతో కొండా సురేఖ తరచూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
గతంలో మంత్రిగా పని చేశానని, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 5సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందానని ప్రస్తుతం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కించపరిచేందుకు కొండా సురేఖ మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలు మీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని తెలిపారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో తనని కించపరిచేలా చేసిన వ్యాఖ్యల గురించి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, తుల ఉమ తనతో చెప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ నెల 18వ తేదీన కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్ష్యులు నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
BRS KTR Files Case On Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురుని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం కలిగేలా మంత్రి వ్యవహరించారని కేటీఆర్ దావా వేశారు.