Perugu Oora Karam Pachadi Recipe : కొంతమందికి భోజనంలో ఎన్ని కూరలున్నా కూడా ఏదోక పచ్చడితో.. రెండు ముద్దలు తింటేనే తృప్తిగా ఉంటుంది. అలాంటి వారి కోసం కాస్త కారంగా ఎంతో రుచికరంగా ఉండే ఒక సూపర్ పచ్చడిని పరిచయం చేయబోతున్నాం. అదే 'పెరుగు ఊర కారం పచ్చడి'. పెరుగులో ఎండుమిర్చిలను ఊర బెట్టి ఈ పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ, వడ, దోశ, బజ్జీ వంటి అన్ని టిఫెన్ల నుంచి వేడివేడి అన్నం వరకు అన్నింటితోనూ తినొచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కారం పచ్చడితో తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా.. ఈజీగా ఈ పెరుగు ఊర కారం పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- ఎండు మిర్చి-20
- రుచికి సరిపడా ఉప్పు
- జీలకర్ర-టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-15
- పెరుగు-కప్పు
- ధనియాలు-2 టేబుల్‌స్పూన్లు
- బెల్లం పొడి-టేబుల్‌స్పూన్
తాలింపు కోసం..
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర-అర టీస్పూన్
- ఆవాలు-అర టీస్పూన్
- అల్లం తురుము-టీస్పూన్
- పచ్చిశనగపప్పు-టీస్పూన్
- కరివేపాకు
- ఎండుమిర్చి-2
- ఇంగువ-అర టీస్పూన్
- పసుపు - చిటికెడు
తయారీ విధానం..
- ముందుగా ఎండుమిర్చిలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులోని గింజలను పూర్తిగా తీసేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి మిర్చి గింజలు వేసుకోకూడదు.
- ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలున్న గిన్నెలో బాగా చిలికిన పెరుగును మిర్చి ముక్కలు మునిగేంత వరకు పోయాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి గంటపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ధనియాలను వేయించి తీసుకోవాలి.
- తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి పెరుగులో ఊరెబట్టిన ఎండు మిర్చిలను వేసుకోవాలి. అలాగే అందులోకి ఎండు మిరపకాయను ఊరబెట్టగా మిగిలిన పెరుగు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు వేసుకోవాలి. వీటిన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం తురుమువేసి వేయించుకోవాలి.
- అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి.
- అలాగే మిగిలిన పెరుగు వేసుకుని కలుపుకోవాలి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని పచ్చడి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చడి దగ్గర పడి.. నూనె పైకి తేలిన తర్వాత బెల్లం పొడి వేసి కలుపుకోండి. (కొద్దిగా బెల్లం వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.)
- తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు ఊర కారం పచ్చడి రెడీ. ఇది రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేయండి.
పచ్చి చింతకాయల రోటి పచ్చడి - పుల్లగా, కారంగా అద్దిరిపోతుంది!
అమ్మమ్మల కాలం నాటి "కంది పచ్చడి" - మీరు ఎన్నడూ చూడని రుచి చూస్తారు!