Minister Rajini Review Meeting: గుంటూరులో కలుషిత తాగునీరు తాగి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. అయితే నగరంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తాజాగా సమీక్షించారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. నగరంలోని ప్రజలకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
గుంటూరులో కలుషిత నీరు తాగి ప్రజల ఆరోగ్యం క్షీణించడంపై, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, మేయర్, కమిషనర్, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొత్తం 41 మంది డయేరియా అనుమానిత లక్షణాలతో బాధ పడుతున్నట్లు మంత్రి రజని వివరించారు. వారందరూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారని తెలిపారు.
ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు
అనారోగ్యానికి గురైన వారిలో 8 మంది గుంటూరు నగరానికి చెందిన వారు కాదని మంత్రి వివరించారు. వారు గురజాల, మేడికొండూరు, పేరేచర్ల, సిరిపురం ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. ఆహార, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రయోగ శాలకు పంపించామన్నారు. డయేరియా అనుమానిత కేసులు తాకిడి ఉన్న శారద నగర్ కాలనీలో ప్రత్యేకంగా వైద్య సేవలందిస్తున్నామన్న మంత్రి వివరించారు.