Minister Ponnam Reaction On Konda Surekha Issue :సహచర మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తరువాత కూడా సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల మహిళా మంత్రి కొండా సురేఖ ఒంటరి కాదు అని హెచ్చరించారు. ఇవాళ గాంధీభవన్‌లో చిట్ చాట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారన్నారు. ఆ తరువాత కూడా పలువురు స్పందించడం సరియైనది కాదన్నారు.
మొన్న బీజేపీ, ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీలు రైతుల కోసం ఆందోళన చేశారంటే తాము ముందు నుంచి అనుకున్నట్లుగానే ఒకరి తరువాత ఒకరు రైతుల కోసం ఆందోళన చేశాయంటే, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. రాష్ట్రంలో వరద నష్టం రూ.10 వేల కోట్లు జరిగితే కేంద్రం కేవలం రూ.400 కోట్లు ఇచ్చిందని మంత్రి పొన్నం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారం నుంచి దిగిపోయే సమయానికి రూ.40 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలకు కూడా బకాయి పెట్టి పోయినట్లు విమర్శించారు.