Minister Ponnam Prabhakar At Vana Mahotsav: కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకువె ళ్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వన మహోత్సవం పేరుతో ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
Van Mahotsav in Hyderabad :వన మహోత్సవంలో భాగంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం మొక్కలు నాటి గ్రేటర్లో వన మహోత్సవాన్ని ప్రారంభించారు. పిట్టలు గూళ్లు పెట్టలేని మొక్కలు నాటి గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆయన మండిపడ్డారు.
'హరితహారం' పేరు మార్చిన సర్కార్ - ఇకపై ఏమని పిలవాలంటే?
కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని, ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నగర వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యత కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
గత పది సంవత్సరాల్లో నాటిన మొక్కల సంఖ్యతో పనిలేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ఈ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటిన మొక్కలను ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్లు కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో మాస్క్లు పెట్టుకోకుండా బతకాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం ప్రతి ఇంటికీ మొక్కలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటాలని నిర్ణయించాం. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లలో నేడు 7,134 పైగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాం. - విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్
ఈ ఏడాది ఘనంగా 'వన మహోత్సవం' - 20.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం