Minister Ponnam Prabhakar at Government School :రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ అన్నిరకాల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా బడి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు. హైదరాబాద్ అబిడ్స్ అలియాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26 వేల ప్రభుత్వ పాఠశాలలకు 11 వందల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత పదేళ్లల్లో విద్య నిర్వీర్యం అయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి : అలియాలోని ప్రభుత్వ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని మంత్రి పొన్నం కొనియాడారు. విద్యార్థులు ఆసక్తిగా చదవడంతోపాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, డీఈవో రోహిణి, అధికారులు పాల్గొన్నారు.