Minister Ponnam Appreciates Lady Conductor : టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణీకి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపో మహిళా కండక్టర్ జి. భారతికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతత్వం చాటుతుండటం అభినందనీయం అని మంత్రి పొన్నం కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అసలేం జరిగింది? :ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో బస్సులో ఉన్న మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి మహిళకు పురుడుపోసింది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గద్వాల-వనపర్తి రూట్ పల్లెవెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణీ రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తి బయలుదేరింది.
బస్సు వనపర్తి జిల్లా నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణీకి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్సు సాయంతో గర్భిణీకి పురుడు పోశారు. ఆ మహిళ పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 అంబులెన్స్ సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.