Minister Nara Lokesh Review on Education Department:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ (SMC) పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
స్కూళ్ల నిర్వహణపై ఫీడ్ బ్యాక్ కోసం రూపొందించిన యాప్‌లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని తెలిపారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతి స్కూలుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను వెంటనే సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. విద్యాకానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకేరకమైన ప్యాట్రన్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు.