ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాదీవెన స్థానంలో పాత విధానం - కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై లోకేశ్ ఆందోళన - Lokesh Review on Higher Education

Lokesh Review Meeting on Higher Education: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై మంత్రి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతవిద్యపై అధికారులతో నారా లోకేశ్ సమీక్షించారు. విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.

Lokesh Review Meeting on Higher Education
Lokesh Review Meeting on Higher Education (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 8:14 PM IST

Updated : Jul 16, 2024, 9:27 PM IST

Lokesh Review Meeting on Higher Education: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్​మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ మొత్తం కళాశాలకు చెల్లించేలా మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3 వేల 480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలచిపోయాయని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్​ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

రెండేళ్లుగా రాని జీతాలు - 24 గంటల్లో పరిష్కారం చూపిన మంత్రి లోకేశ్​ - lokesh Prajadarbar

డ్రగ్స్​పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీచేసేందుకు కసరత్తు చేపట్టాలన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారుచేసి, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటనకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత అయిదేళ్లుగా ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీరియస్​గా దృష్టిసారించి, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటినీ డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరుపై సమీక్షించారు.

అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్​కు కళాశాలల ఎంపిక, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యశాఖ ఇన్​ఛార్జి ఛైర్మన్ రామ్మోహన్ రావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ బి.నవ్య తదితరులు పాల్గొన్నారు.

'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar

Last Updated : Jul 16, 2024, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details