Minister Nara Lokesh Counter to YS Jagan: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్‌బాల్ ఆడుకుంది జగనే: చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన వైఎస్ జగన్ తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉందని ధ్వజమెత్తారు. గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్షరాలా 6 వేల 500 కోట్లు తమ నెత్తిన పెట్టి పోయిందని మండిపడ్డారు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన జగన్‌దని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్‌బాల్ ఆడుకుంది జగనే అని విమర్శించారు.
ఇకపై నేరుగా కళాశాలలకే సొమ్ము: అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం జగన్‌కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో 3 వేల 500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను యువగళం పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించామన్నారు. గత ప్రభుత్వ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించామని, ఇకపై ఫీజురీఎంబర్స్మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు: అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని జగన్ గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధంగా చెయ్యకుండానే సీబీఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక సీబీఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90 శాతం మంది ఫెయిలయ్యారని, జగన్ నిర్ణయాలు బ్లైండ్‌గా ఫాలో అయితే పిల్లలు అంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్లేవారన్నారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకున్నారని దుయ్యబట్టారు.