Minister Nara Lokesh Congratulate on Eenadu Golden Jubilee:జనహితమే అభిమతంగా, సమాజ శ్రేయస్సు కోసం ఈనాడు ప్రారంభించిన అక్షర ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్షర సైన్యానికి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. నాడు, నేడు, ఏనాడు ఈనాడుది ప్రజామార్గమని కొనియడారు. ప్రజాపక్షమై ప్రభుత్వాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు నిత్యం అక్షర యుద్ధం చేస్తూనే ఉందని ప్రశంసించారు. పాలకులు కక్ష కట్టి ఆస్తులు ధ్వంసం చేసినా, తప్పుడు కేసులతో వేధించినా జనానికి రక్షగా నిలుస్తూనే ఉందని కొనియడారు. పత్రిక ద్వారా సమాజానికి దిక్సూచిగా నిలవడం ఈనాడుకే చెల్లిందన్నారు. విద్య, విజ్ఞానం, వినోదం, ఉద్యోగం, వ్యవసాయం, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ, స్వయం ఉపాధి, స్ఫూర్తివంతమైన కథనాలు, సమస్త సమాచారం పాఠకులకు అందించి తెలుగు లోగిళ్లలో చైతన్య క్రాంతిగా ఈనాడు నిలిచిందన్నారు.
విద్యుత్ కాంతులతో వెలుగులు చిమ్ముతున్న ఈనాడు కార్యాలయాలు - Eenadu 50 Years Celebrations
గుడ్ మార్నింగ్ అంటూ తెలుగువారిని మేల్కొలిపే ఈనాడు వెయ్యేళ్లు వర్థిల్లాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈనాడు 50 ఏళ్ల సంబరం సమయంలో వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు గారు లేకపోవడం బాధాకరమన్న లోకేశ్, కానీ ఈనాడు రూపంలో ఆయన మన మధ్యే జీవించి ఉంటారని స్పష్టం చేశారు. అర్ధ శతాబ్దం పాటు విలువలు, నిబద్ధత, విశ్వసనీయతతో సమాజ హితం లక్ష్యంగా దిగ్విజయంగా ఈనాడుని నడిపిస్తున్న యాజమాన్యం, ఉద్యోగులు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. ఈనాడు ఎడిటర్ నుంచి ఇంటికి ఈనాడు పేపర్ వేసే బాయ్ వరకు దశాబ్దాలుగా చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని కొనియడారు..