CID Inquiry into PDS Rice Smuggling :విశాఖ, కాకినాడలో జరిగిన సంఘటనలు, రాష్ట్రంలో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ పైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఈ వ్యవహారం మీద సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. విశాఖ కలెక్టర్ ఆఫీసులో మాట్లాడిన ఆయన బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేశామని తెలిపారు. కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని చెప్పారు. విశాఖలో ప్రాంతీయ సదస్సు నిర్వహించామని, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించారు. ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.
పది రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 229 కోట్ల నిధులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ సమయానికి 2092 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారని తెలిపారు. ఐదు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటిస్తానన్న మనోహర్.. విశాఖ, కృష్ణ పట్నం పోర్ట్లు కంటే రెండింతలు బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు.
కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం తరలింపులో కొందరు సీనియర్ అధికారులు ఉన్నారని, ఆ విషయం తనకెంతో బాధ కలిగించిందని చెప్పారు. స్టెల్లా షిప్లో ప్రతి అణువణువు కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని, అక్రమ బియ్యం రవాణా అంశాలలో ఇప్పటి వరకు 729 మందిపై కేసులు నమోదు చేసి 102వాహనాలు సీజ్ చేశామని నాదెండ్ల వివరించారు.