Bhoomi Puja for NH 65 Flyover at Chityala : లోటు బడ్జెట్లో ఉన్నా, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల వద్ద ఉన్న ఎన్‌హెచ్ 65 ఫ్లైఓవర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్లలో చేయని అభివృద్ధి, కాంగ్రెస్ ఆరు నెలల్లో చేసిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రూ.వేల కోట్లు దోచుకుని గత ప్రభుత్వం కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్‌హెచ్ 65పై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని తెలిపారు. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిట్యాల వద్ద రూ.40 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామని వివరించారు. మరోవైపు చౌటుప్పల్ వద్ద రూ.140 కోట్ల వ్యయంతో మరో ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్‌లోపు ఎన్‌హెచ్ 65 ఆరు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.