Minister Kollu Ravindra on Excise Department :ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, మందుబాబులకు మరిన్ని గుడ్ న్యూస్‌లు చెప్పింది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అంతే కాకుండా మద్యం ధరల తగ్గింపుపై కమిటీ సైతం వేసినట్లు తెలిపారు.
నాణ్యతతో పాటు తక్కువ ధరకు: వైఎస్సార్సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులతో విశాఖలో మంత్రి కొల్లు సమీక్ష నిర్వహించారు. నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.
ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది: తెలంగాణ అమ్మకాలకు, ఏపీలో అమ్మకాలకు 4 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు తేడా వచ్చిందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వ అరాచకాల మీద విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైట్ పేపర్ విడుదల చేశామన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదన్నారు. మూడు వేల దుకాణాలకు, 90 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. 1800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు.
MRPకి మించి మద్యం అమ్మితే 5 లక్షలు జరిమానా - రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
మరింత తగ్గనున్న మద్యం రేట్లు: అదే విధంగా కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. రేట్లు తగ్గించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని స్పష్టం చేశారు. మద్యం ధరలు తగ్గించేలా కమిటీ వేశామన్నారు. త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని, కొత్త బ్రాండ్ల అమ్మకాలు త్వరలో తెస్తామన్నారు.
ఆంధ్ర వర్సిటీ ల్యాబ్‌లో 9 రకాల పరీక్షలు: గతంలో డిస్టిలరీ, తయారీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని, గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖలోని అక్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో ఎక్సైజ్ ల్యాబ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ భరత్ సందర్శించారు. ల్యాబ్‌లో పరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర వర్సిటీ ల్యాబ్‌లో 9 రకాల పరీక్షలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
నిర్మాణ రంగం అభివృద్ధికి పూర్తి సహకారం:అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మైనింగ్ అధికారులు, క్వారీ యజమానులతో సైతం మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి, గత ఐదేళ్లూ మైనింగ్ వ్యవస్థను మాఫియా మయం చేసి దోచుకున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, దాడులతో పరిశ్రమలను దెబ్బతీశారని, రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రతి రంగంలో వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలనుకున్నామని, అమలు చేశామన్నారు. సీనరేజ్, జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఏపీలో మద్యం నాణ్యతపై ఆరా! - రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు