Minister Kishan Reddy launch Golconda light and Sound Show : ఆధ్యాత్మికత, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భాగ్యనగరాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారించాలని కిషన్‌రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇవాళ గోల్కొండ కోటలో ఎల్యుమినేషన్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
గోల్కొండ చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా 30 నిమిషాల 20 సెకండ్ల నిడివిగల వీడియోను మాజీ కేంద్ర మంత్రి, సినీనటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం గోల్కొండ కోటపై దానిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కాకతీయ వంశంలో నిర్మించిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరంగల్ పోర్టులో కూడా లైట్ అండ్ షో ఏర్పాట్లపై పనులు జరుగుతున్నాయని, త్వరలో అది కూడా ప్రారంభం కానుంది చెప్పారు.
'భవిష్యత్ తరాల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. త్వరలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదేవిధంగా వరంగల్లోనే కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ఆర్ట్స్ కళాశాలలో కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తున్నాం. ఈ నాలుగైదు రోజుల్లో అది కూడా ప్రారంభం కానుంది' - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి