Minister Kishan Reddy Fires On Congress :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ, ఇలా ఆపార్టీ ఇచ్చిన ఏ ఒక్క మాటపై కూడా నిలబడలేదని విమర్శించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజార గార్డెన్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్‌కీబాత్' కార్యక్రమం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీ
ఆర్ఎస్ ఏవిధంగా ప్రజలను మభ్యపెట్టిందో అదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా మోసపూరితమైనవని, అవినీతి మయమైవని ఆరోపించారు.
అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలి :మన్ కీ బాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సామాజిక అంశాలపై ప్రస్తావించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని తెలిపారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా తమ తల్లి పేరు మీద ఈ వానాకాలంలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తిని ఆ చెట్టులో చూసుకోవాలని పేర్కొన్నారు. దీనివల్ల భూమాతను పర్యావరణ కాలుష్యం నుంచి పరిరక్షించిన వారమవుతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.