Rajamahendravaram news Today:కార్తిక మాసం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. భక్తులు ఒకే రోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించింది.
రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక బస్సుయాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్: రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్‌లో ఈ బస్సుయాత్రను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అక్టోబరు 26న ప్రారంభించిన ఈ బస్సు ప్రతీ శనివారం ఉదయం 6 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం చేరుకోవడంతో ఈ యాత్ర ముగియనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా వారి కోసం ఆదివారం కూడా అధ్యాత్మిక యాత్రను కొనసాగించే ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.
సందర్శించే పుణ్యక్షేత్రాల వివరాలు:ఈ బస్సు యాత్రలోకోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ తరువాత అక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాల సందర్శన ఉంటుంది. ఇక చివరిగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి హారతితో బస్సు యాత్ర ముగియనుంది. ప్రతీ శనివారం ఈ యాత్ర ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.