Gottipati Ravi Kumar On Electricity Charges: ఇంధన సర్దుబాటు ఛార్జీల (Fuel and Power Purchase Cost Adjustment charges) పాపం జగన్ రెడ్డిదేనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే డిస్కంలు వసూళ్లకు అనుమతి కోరాయన్నారు. దానిని అప్పట్లో వాయిదా వేస్తూ, కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని వెల్లడించారు.
విద్యుత్ కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో విధానం: విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కోని (Andhra Pradesh Power Generation Corporation Limited) నిర్వీర్యం చేసి, ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో విధానం ద్వారా జరిపి, వచ్చిన ప్రజల సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్‌కి తరలించారని ఆరోపించారు.