Minister Dharmana Prasada Rao Comments: "కడప నుంచి ఎవడో వచ్చాడు. సుబ్బారెడ్డి అంట, భూములు దొబ్బేస్తామంటున్నాడు. అసలు నిన్ను ఇక్కడకి ఎవడు రమ్మని అన్నాడు. శ్రీకాకుళం ఏమైనా నీ అబ్బగారి సొమ్ము అనుకున్నావా" అంటూ కడప రెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
కడప రెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో కళింగ కోమటి సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లి పోతాయన్నారు. దీంతో ఇక్కడ ఉండే పరిస్థితిని స్థానికులు కోల్పోతారని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) స్పష్టం చేశారు.
కడప రెడ్ల భూ కబ్జాలపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!
ధర్మాన వ్యాఖ్యలు: "ఒక ప్రజాప్రతినిధి నిజాయతీగా ఉండాలి, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదు. వేరే వాళ్ల భూములను కాజేయాలని ఎప్పుడూ చూడకూడదు. నాయకుడు అవనితీకి పాల్పడకూడదు. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదు. ఈ విధానాన్నే నేను పాటిస్తాను. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి అంట ఒకడు వచ్చాడు, భూములు దొబ్బేస్తా అన్నాడు. అసలు నిన్ను ఎవరు శ్రీకాకుళంకి రమ్మని అన్నాడు, తంతా ఇక్కడ నుంచి దొబ్బేయి అని అన్నాను. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఏ పార్టీ అనేది కూడా నేను చూడను."
దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు: ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ధర్మాన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అనే దానిపై ఒక్కొక్కరూ ఒక్కోలా అనుకుంటున్నారు. దానికి తోడు కడప సుబ్బారెడ్డి అని కూడా చెప్పడంతో, కడపలో ఎవరా సుబ్బారెడ్డా అంటూ చర్చ మొదలు పెట్టారు. అయితే ధర్మాన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలపైనే ఏమో అని కూడా పలువురు చర్చించుకుంటున్నారు.
ఇంకా ఏం అన్నారంటే:కడప రెడ్లపైన వ్యాఖ్యలతోనే ధర్మాన ఆగలేదు. మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి వచ్చి పలువురు శ్రీకాకుళంలో భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిని తాను అవమానంగా భావిస్తానని పేర్కొన్నారు. వేరే జిల్లాలు ఇప్పటికే రౌడీల మయంగా మారాయని, శ్రీకాకుళంని సైతం ఆ విధంగా చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో తాను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే వైసీపీ తరపున బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి : మంత్రి ధర్మాన ప్రసాదరావు