Minister Damodar Raja Narasimha Review On Monkeypox :మంకీపాక్స్పై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో మంకీపాక్స్పై మంత్రి దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి రాజనర్సింహా, వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులు : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని దామోదర రాజనర్సింహా సూచించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కమిషనర్ ఆర్.వి.కర్ణన్, డీహెచ్ రవీందర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.